కరోనాతో తల్లడిల్లుతున్న అమెరికాపై ప్రకృతి కూడా పగబట్టినట్లే కనిపిస్తోంది. భీకర తుపానుతో విరుచుకుపడుతూ కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అగ్రరాజ్యం అమెరికాను భయంకరమైన తుపాను వణికిస్తోంది. బలమైన గాలులతో హరికేన్ ఐదా విరుచుకుపడుతోంది. దాదాపు 16 ఏళ్ల కింద పెను విషాదాన్ని మిగిల్చిన హరికేన్ మిస్సిసిపి, లూసియానా ప్రాంతాలను కల్లోలానికి గురి చేసిన రోజే ఐదా విలయం సృష్టించడం విశేషం. బలమైన గాలులతో తరుమకొచ్చిన ఈ హరికేన్ మిస్సిసిపి నదీప్రవాహానే మార్చేసిందంటే ఇదెంత తీవ్రమైనదో అర్దమవుతోంది. గంటలకు 230 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో లూసియానా రాష్ట్రం చిగురుటాకులా వణికింది. అత్యంత జనసాంద్రత కలిగిన ఓర్లీన్‌లో విద్యుత్ సరఫరా స్తంభించింది. మిస్సిసిపి, లూసియానాల్లో 10 లక్షల మందికిపైగా అంధకారంలో గడపాల్సి వచ్చింది. ప్రమాదం పొంచివున్న ప్రాంతాలకు ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
న్యూఓర్లీన్స్ నుంచి దాదాపు 3.9 లక్షల మంది నివాసితులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. పర్యావరణ మార్పుల కారణంగా ఇలాంటి బలమైన హరికేన్లు తరచూ అమెరికా తీరాన్ని తాకుతుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా ఐదా తీవ్రతను ప్రజలకు అతి సమీపంగా పరిచయం చేసేందుకు మిస్ పిగ్గీ రీసెర్చీ మిషన్‌లో ప్రయాణించి ఇద్దరు పైలట్లు సాహస చాత్ర చేశారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో మీదుగా ప్రయాణిస్తూ తుపాను కదలికలను, తీవ్రతను అతి దగ్గరరగా వీడియోలు, ఫొటోలు తీశారు. గల్ఫ్‌పోర్ట్‌లో తరలింపుదారుల కోసం సూచనలు, హెచ్చరికలు చేస్తూ రెడ్‌క్రాస్ షెల్టర్ బోర్డు పెట్టారు.