రహస్య పత్రాలు కలిగి ఉన్న కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మియామి కోర్టుకు హాజరయ్యారు. తాను ఏ తప్పూ చేయలేదని కోర్టుకు తెలిపారు. అతి సున్నితమైన రహస్య పత్రాలు దాచిన కేసులో ట్రంప్‌పై నేరాభియోగం నమోదు అయ్యిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ట్రంప్ కోర్టుకు హాజరుకావడం ఇది రెండోసారి. ఆ తర్వాత ఆయన న్యూజెర్సీలోని బెడ్‌మిన్‌స్టర్‌లో ఉన్న గోల్ఫ్ కోర్సుకు వెళ్లారు. అక్కడ అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడారు.
క్లాసిఫైడ్ డాక్యుమెంట్లను దగ్గర పెట్టుకునేందుకు తనకు అన్ని హక్కులు ఉన్నట్లు ఆయన చెప్పారు. 76 ఏళ్ల ట్రంప్‌పై మెజిస్ట్రేట్ జడ్జి జోనాథన్ గుడ్‌మాన్ ఎటువంటి ఆంక్షలు విధించలేదు. దేశీయ, అంతర్జాతీయ ట్రావెల్ ఆంక్షలు విధించలేదు. చాలా హేయమైన రీతిలో అధికార దుర్వినియోగానికి బైడెన్ ప్రభుత్వం పాల్పడుతోందని ట్రంప్ విమర్శించారు.పూచీకత్తుపై ట్రంప్‌ను రిలీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన అంశాలను సాక్ష్యాలతో చర్చించరాదు అని కోర్టు ఆదేశించింది.