ప్రియదర్శి, రూపా కొడువయూర్ జంటగా నటిస్తున్న చిత్రం సారంగపాణి జాతకం. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శివలెంక కృష్ణప్రసాద్ విలేకరులతో ముచ్చటించారు. ఫుల్ లెన్త్ కామెడీ జోనర్ మినహా అన్ని తరహా సినిమాలూ నిర్మించా. జంధ్యాల జీవించి ఉన్న రోజుల్లో ఆయన కనిపించినప్పుడల్లా అడిగేవాడ్ని ఓ సినిమా చేసి పెట్టండి సార్ అని, చేద్దాంలే ప్రసాద్ అంటూ ఉండేవారాయన. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన వెళ్లిపోయారు. దాంతో ఆ లోటు అలాగే ఉండిపోయింది. ఇప్పుడు సారంగపాణి జాతకం సినిమాతో ఆ లోటును దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ భర్తీ చేశాడు. రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకునే కామెడీ థ్రిల్లర్ ఇది. నిర్మాతగా నా కెరీర్‌లో గుర్తుండిపోయే మరో సినిమాగా సారంగపాణి జాతకం నిలుస్తుంది అని అన్నారు.

ఇంద్రగంటి జెంటిల్‌మేన్ తో నిర్మాతగా నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. సమ్మోహనంతో మా సంస్థకు ఇంద్రగంటి మరో విజయాన్నిచ్చారు. రేపు రానున్న సారంగపాణి జాతకం తో మా కాంబినేషన్‌లో హ్యాట్రిక్ రాబోతుంది. ఈ సినిమా కథ, కథనం అందర్నీ మెప్పిస్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది. సరైన రిలీజ్ కోసమే కాస్తంత టైమ్ తీసుకున్నాం.

సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. ఇదే మంచి సీజన్ అనుకొని ఏప్రిల్ 25న వస్తున్నాం అని తెలిపారు. ఈ సినిమా చూసిన శ్రేయోభిలాషులంతా బావుందని మెచ్చుకున్నారని, ద్వితీయార్ధం నెక్ట్స్ లెవల్లో ఉంటుందని, ఆద్యంతం ఆసక్తికరంగా సినిమా సాగుతుందని, ప్రియదర్శి, నరేశ్, వెన్నెలకిశోర్, అవసరాల శ్రీనివాస్, వైవాహర్షల కామెడీ హైలైట్‌గా నిలుస్తుందని, కోర్ట్ లో సీరియస్ మోడ్‌లో కనిపించిన ప్రియదర్శి ఈ సినిమాలో పూర్తిభిన్నంగా కనిపించి అందర్నీ నవ్విస్తారని చెప్పారు. ఈ చిత్రం ఈ నెల 25న సినిమా విడుదల కానుంది.