అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఆయన గెలుపునకు అనేక అంశాలు దోహదపడినా అందులో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ పాత్ర గణనీయమైనదని చెప్పక తప్పదు. ఒక నక్షత్రం పుట్టింది.. అదే ఎలాన్ అని ట్రంప్ తన ఎన్నికల ప్రసంగంలో మస్క్‌ను ప్రశంసలతో ముంచెత్తాడంటే ఆయనకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ విజయంలో ఎలాన్ ప్రముఖ పాత్ర పోషించారు. కేవలం ఆర్థికపరంగానే కాక, ట్రంప్‌కు ఒక స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. తన సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ట్రంప్‌కు విస్తృత ప్రచారం కల్పించారు. ఆయన ప్రచారం ఎంత తారస్థాయికి చేరిందంటే ట్రంప్ అధ్యక్షుడు కాకపోతే అమెరికా నాశనం అయిపోతుందన్నట్టుగా ప్రజల మనస్సులను ప్రభావితం చేశారు. ట్రంప్‌తోనే అమెరికాకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రచారం చేశారు. దానిని ప్రజలు కూడా నమ్మారు.
ఇప్పుడు కరడు గట్టిన రిపబ్లికన్‌గా వ్యవహరిస్తున్న ఎలాన్ మస్క్ గతంలో ట్రంప్ ప్రత్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేశారు. 2016లో హిల్లరీ క్లింటన్‌కు, 2020 ఎన్నికల్లో బైడెన్‌కు మస్క్ మద్దతు ఇచ్చారు. అయితే 2020లో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన విధానాలు, పాలనా తీరును మస్క్ విమర్శించడం ప్రారంభించారు. దీంతో 2021 నుంచి ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. శ్వేత సౌధంలో జరిగిన శిఖరాగ్ర సమావేశానికి తన కంపెనీ టెస్లాకు బైడెన్ ఆహ్వానం పంపలేదని మస్క్ ఆరోపించారు. అలాగే కార్మిక సంఘాలకు జో బైడెన్ మద్దతు ఇవ్వడాన్ని మస్క్ తప్పుబట్టారు. దీంతో 2022లో డెమొక్రటిక్‌ను విభజన, ద్వేషపూరిత పార్టీగా ముద్ర వేస్తూ తాను ఆ పార్టీని వీడి రిపబ్లికన్ వైపు వెళ్తున్నట్టు ప్రకటించారు.