రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్థాన్‌లో తమ బలగాలను మోహరించిన అమెరికా.. ఇప్పుడు తాను విధించిన డెడ్‌లైన్‌లోపే ఆ దేశాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయింది. అమెరికా చివరి సైనికుడు కూడా ఆఫ్ఘన్‌ను వదిలి వెళ్లాడు. ఆ చివరి సోల్జర్‌కు సంబంధించిన ఫొటోను అమెరికా రక్షణ శాఖ షేర్ చేసింది. ఆర్మీ మేజర్ జనరల్ అయిన క్రిస్ డొనాహ్యూ ఆఫ్ఘన్ నుంచి వెళ్లిన చివరి అమెరికా సైనికుడిగా నిలిచాడు. నైట్ విజన్ కెమెరాతో తీసిన ఈ పొటోలో కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎక్కడానికి వెళ్తున్న క్రిస్‌ను చూడొచ్చు. మేజర్ జనరల్ డోనాహువే 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌లో కమాండర్‌గా పనిచేస్తున్నారు. కాబూల్‌లోని అమెరికా మిషన్‌ను ముగించుకుని చివరగా ఆయన విమానమెక్కారు. ఇదే విమానంలో ఆఫ్గాన్‌కు అమెరికా రాయబారి రాస్ విల్సన్ కూడా ఉన్నారు. మేజర్ జనరల్ గతేడాదే ఎయిర్‌బోర్న్ డివిజన్ కమాండర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు కంబైన్డ్ జాయింట్ స్పెషల్ ఆపరేషన్ టాస్క్‌ఫోర్స్ కమాండర్‌గా పనిచేశారు.