
అమెరికాలోని కాలిఫోర్నియాలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్ (ఏఐఏ) ఆధ్వర్యంలో బే ఏరియాలోని శాన్‌జోస్ డౌన్‌టౌన్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో 50కి పైగా భారతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. హోలీ ఫెస్ట్ ఉల్లాసంగా, వినోదాత్మకంగా సాగింది. దృశ్యపరంగా అద్భుతంగా ఉన్న ఈ హోలీ ఫెస్ట్ వినోదాత్మకంగా ఉంది.15 వేలకు మందికి పైగా ఆహూతులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఈ వేడుకల్లో పాల్గొన్నవారు సరదాగా ఒకరిపై ఒకరు రంగులు, గులామ్ చల్లుకుంటూ హోలీని సంతోషంగా జరుపుకున్నారు.


రాధాకృష్ణుల మధ్య శాశ్వతమైన, దైవికమైన ప్రేమకు హోలీ పండుగ ప్రతీకగా నిలుస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోలీ జరుపుకుంటారు. వసంతకాలపు రాకను, శీతాకాలపు ముగింపును హోలీ సూచిస్తుంది. వసంత కాలపు పంట కాలం సమృద్ధిగా ఉండాలని హోలీ పండుగ జరుపుకుంటారు.


పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆహూతులందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతిని కాపాడటంలో ఏఐఏ చేస్తున్న కృషిని, ప్రయత్నాలను వారు ప్రశంసించారు. ఈ వేడుకలు చూసి తాము ఎంతో సంతోషించామని, అమెరికాలో కాదు భారతదేశంలో ఉన్నామా అన్న భావన కలిగిందని పలువురు ప్రముఖులు ఆశ్చర్యపోయారు. ఈ హోలీ వేడుకలను చిరస్మరణీయంగా చేసిన ఏఐఏ బృందాన్ని వారు అభినందించారు. హోలీ కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోలను, స్ఫూర్తిదాయకమైన సందేశాలను చాలా మంది ప్రముఖులు తమ సోషల్ మీడియా వేదికలలో పంచుకున్నారు. భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 50కి పైగా కమ్యూనిటీ సంస్థలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఏఐఏకి మద్దతుగా నిలిచాయి.


ఈ కార్యక్రమానికి గ్రాండ్ స్పాన్సర్‌గా సంజీవ్ గుప్తా సీపీఏ, ప్లాటినం స్పాన్సర్‌గా రియల్టర్ లావణ్య దువ్వి, ట్రావెల్ పార్టనర్‌గా ట్రావెలోపోడ్, పవర్డ్ బై రియల్టర్ నాగరాజ్ అన్నియా, ఫుడ్ స్పాన్సర్లుగా మంత్ర ఇండియా అండ్ చాట్ భవన్ వ్యవహరించాయి. ఇతర స్పాన్సర్‌లలో ఇన్‌స్టా సర్వీస్ అండ్ ఆజాద్ ఫైనాన్షియల్స్ ఉన్నాయి. ఈ ఈవెంట్‌ను విజయవంతం చేయడంలో తమ వంతు కృషి చేసిన వాలంటీర్లకు ఏఐఏ బృందం కృతజ్ఞతలు తెలిపింది.


ఈ కార్యక్రమంలో భారత డిప్యూటీ కాన్సుల్ జనరల్ రాకేష్ అడ్లఖా, శాన్ జోస్ మేయర్ మాట్ మహాన్, సన్నీవేల్ మేయర్ లారీ క్లీన్, ఫ్రీమాంట్ మేయర్ రాజ్ సాల్వాన్, శాన్ జోస్ కౌన్సిల్ సభ్యులు డొమింగో కాండెలాస్ & బీన్ డోన్, శాంటా క్లారా కౌన్సిల్ సభ్యుడు కెవిన్ పార్క్, శాన్ జోస్ పోలీస్ చీఫ్ పాల్ జోసెఫ్ & బృందం, లాస్ ఆల్టో వైస్ మేయర్ నేసా ఫ్లిగోర్, పాలో ఆల్టో వైస్ మేయర్ విక్కీ వీంకర్, శాన్ జోస్ డౌన్‌టౌన్ అసోసియేషన్ సిఇఒ అలెక్స్ స్టెట్టిన్స్కీ, సిలికాన్ వ్యాలీ చాంబర్ ఆఫ్ కామర్స్ సిఇఒ హర్బీర్ భాటియా, కాంగ్రెస్ సభ్యుడు సామ్ లికార్డో, కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా, సూపర్‌వైజర్ ఓట్ లీ, సూపర్‌వైజర్ సిల్వియా అరీనాస్, అసెంబ్లీ సభ్యుడు అలెక్స్ లీ మరియు అసెంబ్లీ సభ్యుడు మార్క్ బెర్మాన్, పలు కార్యాలయాల ప్రతినిధులు పాల్గొన్నారు.
