ప్రజలకు మెరుగైనా సేవలు అందించాలని ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టింది. వీటి ద్వారా ప్రభుత్వం అందించే ప్రతి పథకం అర్హులందరికీ అందుతుందని ప్రభుత్వం నమ్మింది. అటువంటిది అందులోని ఉద్యోగులే బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఎలా అని మంత్రి అప్పలరాజు అన్నారు. పలాస తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గంలో రేషన్‌కార్డుల పంపిణీకి సంబంధించి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రి సచివాలయ డిజిటల్ సహాయకులు, వీఆర్వోలు, సంక్షేమ కార్యదర్శులు, విద్యుత్తుశాఖ ఏఈలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్‌కార్డుకు దరఖాస్తు చేసినవారు అర్హులైన వారు కూడా పలు కారణాలతో కార్డు పొందలేకపోతున్నారు. తప్పుడు సమాచారం కారణంగా అర్హులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. వీటిని సచివాలయాల పరిధిలో సరిచేయాల్సి ఉంది. కానీ ఇక్కడి ఉద్యోగులు ఎందుకు వాటిపై చర్యలు తీసుకుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.
అంతేకాకుండా ఏదైనా పథకం గురించి ప్రజలకు తెలియకపోతే మీరు తెలియజేయాల్సింది పోయి, మీరే ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఎలా, మీ చర్యల కారణంగా ప్రభుత్వం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. అనంతరం జేసీ సుమిత్‌కుమార్ మాట్లాడుతూ.. ఏదైనా దరఖాస్తు తిరస్కరణకు గురైయితే, అందుకు గల కారణం తెలుసుకోవాలని, తక్షణమే సంబంధిత శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకొని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో పురపాలక సంఘ అధ్యక్షుడు గిరిబాబు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.