టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ తనపై వస్తున్న జాతి వివక్ష ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను జాత్యహంకారిని కాదని, తనపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. నా జీవిత భాగస్వామి సగం భారతీయురాలు. ఆమెతో నాకు నలుగురు పిల్లలున్నారు. వారిలో ఒక కుమారుడికి ప్రఖ్యాత భారతీయ భౌతిక శాస్త్రవేత్త పేరు పెట్టాను. అలాంటప్పుడు నేను జాత్యహంకారిని ఎలా అవుతాను? అని మస్క్ ప్రశ్నించారు. మస్క్ భార్య శివోన్ జిలిస్ సగం భారతీయ మూలాలున్న కెనడియన్. వారి కుమారులలో ఒకరి పేరు మధ్యలో శేఖర్స ఉంటుంది. నోబెల్ గ్రహీత, భారత-అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ గౌరవార్థం ఈ పేరు పెట్టారు.

శివోన్ జిలిస్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్ కంపెనీలో 2017 నుంచి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా తన కంపెనీలలో అన్ని జాతులకు చెందిన వారు ఉన్నత పదవుల్లో ఉన్నారని, అక్కడ ఎలాంటి జాత్యహంకారానికి తావులేదని చెప్పారు. విచిత్రం ఏమిటంటే జాతి వివక్ష ఆరోపణలు ఎదుర్కొంటున్న మస్క్, స్వయంగా ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్‌ను శ్వేతజాతి వ్యతిరేక జాత్యహంకారి అని నిందించడం సంచలనం రేపుతోంది.





























