ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ ఆ సంస్థకు 2 లక్షల డాలర్ల భారీ విరాళాన్ని అందజేశారు. అమెరికాలో తెలుగు భాష పరిరక్షణకు తానా విశేష కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తానా ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుల చిన్నారులకు తెలుగుపై మక్కువ పెంచేందుకు తలపెట్టిన పాఠశాల కార్యక్రమ నిర్వహణకు ఈ ఆర్థిక సాయం అందజేసినట్లు ఆయన తెలిపారు. తన పదవీ కాలంలో వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కరోనా లాక్‌డౌన్ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తానా చేసిన సేవలు ఎనలేనివని జయశేఖర్ కొనియాడారు. తానా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన లావు అంజయ్య చౌదరి హయాంలో సంస్థ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.