హైదరాబాద్ మహానగరం మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘భారత్ సమ్మిట్’ రెండో ఎడిషన్ నవంబర్ 13, 14 తేదీలలో హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ, హైటెక్స్ ప్రాంగణాల్లో నిర్వహించనున్నారు. దాదాపు 70 దేశాల నుంచి విధాన నిర్ణేతలు, ప్రగతిశీల భావజాల నేతలు, మేధావులు, దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.

ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రజాస్వామ్యంపై చూపే ప్రభావం, ఎన్నికల పారదర్శకత, దక్షిణార్థ గోళ దేశాల మధ్య సహకారంపై విస్తృత మేధోమథనం జరగనుంది. ద్వేషం, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రగతిశీల రాజకీయ పక్షాలను ఒకే తాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ వేదికను తీర్చిదిద్దుతోంది. దీనిలో భాగంగా ‘అవర్ వరల్డ్’ పేరిట గ్లోబల్ థింక్ ట్యాంక్‌ను ప్రారంభించనున్నారు. రెండు రోజుల సదస్సులో మొత్తం 12 అంతర్జాతీయ సెషన్లతో పాటు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 8 సెషన్లను నిర్వహించనున్నారు.

ఈ సమ్మిట్‌లో ‘తెలంగాణ రైజింగ్’ పేరిట నిర్వహించే సెషన్లలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం, ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం, సంక్షేమ విధానాలపై చర్చిస్తారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి ఈ సదస్సు వేదిక కానుంది. డిసెంబర్ 7 నుంచి 9 వరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు ఈ భారత్ సమ్మిట్ ఒక సన్నాహక వేదికగా ఉపయోగపడనుంది. సదస్సుకు వచ్చే విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలను డిసెంబర్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌కు ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు.

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నవంబర్ 13 లేదా 14న ఈ సదస్సుకు హాజరవుతారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధ్రువీకరించారు. ఏఐసీసీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సహా పలువురు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు.

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 137వ జయంతిని పురస్కరించుకుని ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడంతో పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచపటంలో మరింత విస్తరించడానికి ఈ భారత్ సమ్మిట్ దోహదపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది.















