సంతోష్ శోభన్, రాశీసింగ్, రుచిత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ప్రేమ్ కుమార్. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శివప్రసాద్ పన్నీరు నిర్మించారు. అభిషేక్ మహర్షి దర్శకుడు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ నేను చాలా సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా పనిచేశాను. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేమ్‌కుమార్ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇందులో చర్చించిన పాయింట్ చాలా కొత్తగా ఉంటుంది. సినిమాల్లో చూపించే పెళ్లి సీన్స్‌లో చివరలో హీరో వచ్చి హీరోయిన్ పెళ్లి ఆపుతాడు. హీరోహీరోయిన్లు కలిసిపోతారు. కానీ ఆ పెళ్లి కొడుకు గురించి ఎవరూ ఆలోచించరు. అయితే అతనికి కూడా ఓ జీవితం ఉంటుంది. అలాంటి కథతో ఈ సినిమా తీశాను. పీటల మీద పెళ్లి ఆగిపోతే ఆ వరుడి పరిస్థితి ఏంటనే కోణంలో కథ రాసుకున్నా. ఆద్యంతం చక్కటి వినోదంతో అలరిస్తుంది. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయి. సంతోష్ శోభన్ పాత్ర కొత్త కోణంలో సాగుతుంది. తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించే చిత్రమవుతుంది. నా తదుపరి సినిమాను ఓ సీరియస్ కథతో చేయబోతున్నా అని చెప్పారు.ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది.