నాని తాజా చిత్రం ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కయాదులోహర్ కథానాయిక. హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ మనం అంకితభావంతో కష్టపడి పనిచేస్తుంటే మన చుట్టూ గెలవాలని కోరుకునే వారు పెరిగినట్లే, ఓడిపోతే చూద్దామనుకునే వాళ్లు కూడా పెరిగిపోతారు. ఓడిపోతే చూద్దామనుకునే వాళ్లను ఓడించడానికి నేను ఎప్పుడూ ప్రయత్నించను. కానీ, నేను గెలుస్తానని నమ్మేవాళ్లను గెలిపించడానికి కష్టపడుతూనే ఉంటా అన్నారు. అభిమానులు నాకు వందేళ్లకు సరిపడా ప్రేమనిచ్చారు. ఇక మనల్ని ఎవరూ ఆపలేరు. 23వ తేది రాత్రి నుంచే థియేటర్లు మొత్తం ఊగిపోతాయి అన్నారు.

నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ బొమ్మ బ్లాక్‌బస్టర్ హిట్ అనే నమ్మకం ఉందని, ఈ సినిమాకు అద్భుతమైన టీమ్ కుదిరిందన్నారు. తన హృదయానికి దగ్గరైన చిత్రమిదని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపంలో తనకు ఓ సోదరుడు దొరికాడని, ఎక్కడకు వెళ్లినా ప్యారడైజ్ పాటలే వినిపిస్తున్నాయని సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వీడియో సందేశంలో ఆనందం వ్యక్తం చేశారు. ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.















