చైనా కారణంగా మరో ప్రజారోగ్యపరమైన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఇప్పటికీ ఉందని భారత సంతతికి చెందిన అమెరికా నేత వివేక్ రామస్వామి తాజాగా హెచ్చరించారు. కరోనా సంక్షోభం కారణాలను వెలికితీయడంలో ఆమెరికా ప్రభుత్వం నిరాసక్తత ప్రదర్శిస్తోందని విమర్శించారు. చైనాతో పొంచి ఉన్న ప్రమాదం గురించి.. వెంటనే చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో మరింత తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోక తప్పదు అని వివేక్ రామస్వామి వ్యాఖ్యానించారు. రామస్వామి 2014లో రాయవాంట్ సైన్సెస్ అనే బయోటెక్ సంస్థను స్థాపించారు. ఆ తరువాత ఓ హెడ్జ్ ఫండ్ భాగస్వామి అయ్యారు. అంతేకాకుండా పలు పుస్తకాలను కూడా రచించారు.
రిపబ్లికన్ పార్టీ తరఫున వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగారు. 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇక రిపబ్లికన్ ప్రైమరీల్లో విజేతగా నిలిచి పార్టీ సభ్యుల మద్దతు కూడగట్టిన వారే పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు అర్హత సాధిస్తారు. ఇదిలా ఉంటే రిపబ్లికన్ పార్టీ తరఫున ఇప్పటికే పలువురు ప్రముఖులు పోటీలో ఉన్నారు.