గత కొన్ని రోజుల నుంచి యుద్ధరంగంలో రష్యా దళాలకు చుక్కలు చూపిస్తున్న ఉక్రెయిన్ దళాలు అదే దూకుడును కొనసాగిస్తున్నాయి. గ్రామాలను, పట్టణాలను స్వాధీనం చేసుకుంటూ డాన్‌బాస్ ప్రాంతంలో ముందుకు కదులుతున్నాయి. ఆ దేశ సేనలు కీలకమైన ఆక్సిల్ నది తీరానికి చేరుకున్నాయి. ఈ నదిని దాటినట్లు కూడా తెలిసింది. అదే జరిగితే రష్యాకు గడ్డుపరిస్థితి తప్పదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు యుద్ధరంగం నుంచి తమ సైనికులు పారిపోతున్న దృష్ట్యా రష్యా తన దూరశ్రేణి క్షిపణులను రంగంలోకి దింపింది. వీటితో శత్రువు దూకుడుకు కళ్లెం చేయాలని భావిస్తోంది. ఊహించని ఉక్రెయిన్ ప్రతిఘటన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను తీవ్రంగా కలవరపరుస్తోంది. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ తమ సైన్యం ఎంతో సంయమనంతో వ్యవహరిస్తోందని, అనవసరంగా రెచ్చగొట్టొదని ఉక్రెయిన్‌ను ఉద్ధేశించి వ్యాఖ్యలు చేశారు. తమపై ఒత్తిడి పెంచితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. డాన్‌బాస్ విముక్తి లక్ష్యంగా తాము చేపట్టిన సైనికచర్యలో ఎలాంటి మార్పులూ ఉండవన్నారు. నిర్ధేశించిన లక్ష్యాలను సాధించేవరకు ఎంతకైనా తెగిస్తామని తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)