ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రారంభించింది ఇజ్రాయెల్, ముందు వాళ్లు దాడులు ఆపితే తామూ నిలిపివేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి అన్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ముగిసిందని, ఇరు దేశాలమధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. ఆఖరి నిమిషం వరకు తమ సైన్యం ఇజ్రాయెల్‌తో పోరాడుతూనే ఉందని చెప్పారు. అయితే యుద్ధం కొనసాగించాలన్న ఆలోచన తమకు లేదన్నారు. ప్రస్తుతానికి కాల్పుల విరమణపై ఎలాంటి ఒప్పందం జరుగలేదని వెల్లడించారు.

ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించిందే ఇజ్రాయెల్. మొదట వారు దాడులు ఆపితే తాము కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ఈ విషయాన్ని చాలాసార్లు స్పష్టం చేశాం. ఇప్పటివరకు కాల్పుల విరమణ, సైనిక కార్యకలాపాల విరమణపై ఎలాంటి ఒప్పందం జరుగలేదు. అయితే ఇరాన్ ప్రజలపై ఇజ్రాయెల్ దాడులను ఆపితే, ఆ తర్వాత ప్రతిదాడులు చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. దేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకు ధైర్యంగా పోరాడుతున్న సైనిక బలగాలకు ఇరాన్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపుతున్నాను.
