విపరీతంగా పెరిగిపోతున్న వలసలను అడ్డుకునేందుకు ఉపాధి వీసాను మరింత కఠినతరం చేయాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచీ అత్యధిక వేతనాలున్న విదేశీ వృత్తి నిపుణులకే వీసాలివ్వాలని, డిపెండెంట్లుగా వచ్చే భాగస్వాములకు కఠిన నిబంధనలు అమలు చేయాలని నిశ్చయించింది. ఈ మేరకు బ్రిటన్ హోంశాఖ మంత్రి జేమ్స్ క్లెవర్లీ హౌస్ ఆఫ్ కామన్స్‌లో బిల్లు పెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే భారతీయులపై తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో పనిచేయ డానికి వచ్చే వృత్తి నిపుణులు తమ కుటుంబ సభ్యులను బ్రిటన్ తీసుకురాలేరు. కఠిన నిబంధనలవల్ల ప్రస్తుత వలసల్లో 3 లక్షల మంది వరకూ తగ్గుతారని మంత్రి క్లెవర్లీ తెలిపారు.