న్యాయమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన సమాజం ప్రతి వ్యక్తి హక్కు. ప్రపంచ దేశాల ఐక్యమత్యంతోనే ఇది సాకారమవుతుంది బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అన్నారు. యునిసెఫ్ సహృద్భావ రాయబారిగా ఉన్న ప్రియాంక, ఐక్యరాజ్య సమితి సర్వసభ సమావేశంలో కీలక ప్రసంగం చేశారు. ప్రపంచ దేశాలు సంఫీుభావంతో వ్యవహరించాల్సిన అవసరం మునుపటి కంటే ఇప్పుడే ఎక్కువగా ఉందని తెలిపారు. ఇందుకు నిర్దేశించుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యా (ఎస్‌డీజీ)ల సాధనకు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
మన ప్రపంచాన్ని మార్చుకునే అద్భుత అవకాశం మనకు ఉంది. ఈ భూగ్రహానికి మనమెంతో రుణపడి ఉన్నాం. సురక్షితమైన, ఆరోగ్యకరమైన, న్యాయపరమైన ప్రపంచంలో జీవించే హక్కు మనందరికీ ఉంది. అందుకు కార్యాచరణ అవసరం. ఎందుకంటే అది కేవలం లక్ష్యం మాత్రమే కాదు. మనందరి నమ్మకం. మనమంతా కలిస్తే ఆ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. మన ప్రపంచ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది అని ప్రియాంక పిలుపునిచ్చారు.