సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం గోట్. వేదవ్యాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ల నిర్మాత. ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. దీనికి హీరో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ నేడు గ్రామాల్లో జరుగుతున్న బెట్టింగ్, గ్యాంబ్లింగ్ పర్యవసానాల గురించి తెలియజెప్పే చిత్రమిదని, చక్కటి సామాజిక సందేశంతో ఆకట్టుకుంటుందని తెలిపారు. మణిశర్మ సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని, వాణిజ్య పంథాలో సందేశాత్మక కథాంశమిదని నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, అడ్డంకులను దాటుకొని ఈ చిత్రాన్ని పూర్తి చేశామని, కంటెంట్ నచ్చితే పది మందికి చెప్పి ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది.















