
రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని వన్ డల్లాస్ ఆధ్వర్యంలో భారీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. దాదాపు 1000 మందికి పైగా ఈ విందుకు హాజరయ్యారు. అంతా కలిసి ఉపవాసం ముగిస్తూ డల్లాస్ ఐక్యతను చాటారు. డల్లాస్ ఫోర్ట్ వర్త్ సమాజంలోని బలాన్ని వైవిద్యాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబించింది. అనే థీమ్‌కు అనుగుణంగా, ఐక్యతను ప్రోత్సహించేలా నిర్వహించారు. మార్చి 2న సాయంత్రం పవిత్ర ఖురాన్ పఠనంతో ఇఫ్తార్ విందు ప్రారంభించగా, విందుకు హాజరైన అందరినీ వన్ డల్లాస్ అధ్యక్షుడు డా రహ్మాన్ మహమ్మద్ ఆహ్వానించారు. మత సామరస్యానికి ఉన్న ప్రాముఖ్యతను వివరించారు.

అతిథులు, ఎన్నికైన ప్రతినిధుల సందేశాలు, వివిధ మతాలు, వృత్తుల మధ్య ఐక్యతను, పరస్పర గౌరవ ప్రాముఖ్యతను వివరించారు. ఇఫ్తార్ విందుకు హాజరైన అంతా మిత్ర భావంతో మమేకమయ్యారు. సహపంక్తి భోజన అనుభవం, అందరికీ ఒకేరకమైన విలువలు ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేసేలా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ విందును విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ విందుకు ఫ్రిస్కో నగర కౌన్సిల్ మెంబర్ గా పోటీ చేస్తున్న గోపాల్ పొన్నంగి, స్కూల్ బోర్డ్ సభ్యుడిగా బరిలో ఉన్న సురేష్ మండువ, టీపీఏడీ సంస్థ నుంచి వేణు భాగ్యనగర్, ప్రముఖ సైకియాట్రిస్ట్ డా. విజయ్ వర్మ ఉప్పలపాటి, డల్లాస్ వైద్యుడు డా.ఇస్మాయిల్ పెనుకొండ తదితరులు హాజరయ్యారు. వీరితో పాటు టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధులు, మేయర్లు, నగర మండలి సభ్యులు, న్యాయమూర్తులు, డల్లాస్ పోలీస్ సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది, వైద్యులు, వ్యాపారులు, న్యాయవాదులు, పలు సంస్థల సీఈవోలు, బోర్డు సభ్యులు, ఎన్నికల అభ్యర్థులు పాల్గొన్నారు.
