అమెరికా పౌరసత్వం లేదా గ్రీన్‌కార్డు ఉన్న వ్యక్తిని వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడాలని కలలు కనే వలసవాదారుల ఆశలు ఇక అంత సులువుగా నెరవేరే అవకాశం లేదు. అక్రమ వలసదారులపై కొరడా ఝళిపిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు వచ్చే వీసాదారులపై ఆంక్షలు కఠినతరం చేస్తున్న కారణంగా బైడెన్ పాలనకు పూర్తి భిన్నంగా పరిస్థితులు మారిపోతున్నాయి. గ్రీన్‌కార్డు కలిగిన వ్యక్తిని వివాహం చేసుకున్న భాగస్వామికి గతంలో ఇంటర్వ్యూలను సైతం పక్కనపెట్టి గ్రీన్‌కార్డు మంజూరు చేసిన రోజులు ఉన్నాయి. కాని ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. దరఖాస్తు ప్రక్రియ దశలోనే జల్లెడ పడుతూ ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనపడుతోంది.

జీవిత భాగస్వామికి సంబంధించిన ఆహార, నిద్ర అలవాట్లు, అలర్జీలు, ఇష్టాయిష్టాలు తదితర అంశాల గురించి గ్రీన్‌కార్డు దారునికి ఏమాత్రం అవగాహన ఉందో అధికారులు ఆరా తీస్తూ ధ్రువీకరణ పత్రాలన్నిటినీ నిశితంగా పరిశీలిస్తున్నారు. బైడెన్ పాలనకు భిన్నమైన పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయని, అధికారులు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా నిర్ధారించుకుంటున్నారని, వివాహానికి సంబంధించిన సాక్ష్యాలను అత్యంత నిశితంగా పరిశీలిస్తున్నారని ఇమిగ్రేషన్ అటార్నీ అశ్విన్ శర్మ వెల్లడించారు.
