పాకిస్థాన్‌లో రాజకీయాలు క్షణక్షణానికి రసవత్తరంగా మారుతూ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన ప్రకటన చేశారు. తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకుంటే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తామని విపక్షాలకు ఇమ్రాన్ ఆఫర్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఓ ముఖ్యమైన వ్యక్తి ద్వారా జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన షాబాజ్ షరీఫ్‌కు ప్రధానమంత్రి సందేశాన్ని చేరవేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇమ్రాన్ ఇచ్చిన ఆఫర్‌ను ప్రతిపక్షాలు అంగీకరిస్తే పాక్‌లో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈ ఆఫర్‌ను ప్రతిపక్షాలు తిరస్కరించినట్లు సమాచారం. అయితే విపక్షాలు మాత్రం తమ నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ప్రతినిధి షాజియా మారి తెలిపింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)