తన భార్య బుష్రా బీబీ జైలుకు వెళ్లడానికి ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీరే కారణమని పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. బుష్రా బీబీ ఓ అవినీతి కేసులో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఇస్లామాబాద్ శివారులోని తన నివాసంలో గృహనిర్బంధంలో ఉన్నారు. ఆర్మీ చీఫ్ జనరల్‌కు ఇమ్రాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గృహ నిర్బంధంలో ఉన్న తన భార్య బుష్రా బీబీకి ఏమైనా జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. నా భార్య బుష్రా బీబీకి శిక్ష పడటానికి జనరల్ అసిమ్ మునీరే కారణం. బుష్రా బీబీకి శిక్ష విధించిన న్యాయమూర్తి నాతో మాట్లాడారు. తీర్పు విషయంలో తనపై ఒత్తిడి ఉండేదని చెప్పారు. నా భార్యకు ఏదైనా జరిగితే అసిమ్ మునీర్‌ను సహించేది లేదు. నేను బతికున్నంత వరకూ అసిమ్ మునీర్‌ను వదిలి పెట్టను. అతడి రాజ్యాంగ విరుద్ధమైన, అక్రమ చర్యలను బయటపెడతా అని ఇమ్రాన్ వార్నింగ్ ఇచ్చాడు.