గల్ఫ్‌లోని బహ్రెయిన్‌లోని తెలుగు ప్రవాసీయులు శ్రీ వేంకటేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి సుప్రభాత సేవ, పాలు, గంధం, పంచామృతాలతో అభిషేక సేవలను రోజంతా నిర్వహించారు. బహ్రెయిన్‌తో పాటు సౌదీ అరేబియా, ఖతర్ దేశాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు కార్యక్రమానికి హాజరై స్వామివారి సేవలో తరించారు. నమో నమోః వేంకటేశ అంటూ భక్తులు పరవశించిపో యారు. పండితుల వేదమంత్రాలు, వేంకటేశ్వరుని కీర్తనలతో కల్యాణ వేదిక అయిన మనమాలోని శ్రీనాథ్జీ మందిర సభా వేదిక ఆధ్యాత్మిక శోభతో అలరారింది. టీటీడీ అధికారులు విభూషణ శర్మ, చిరంజీవి, సాయి ప్రసాద్‌లతో కూడిన ముగ్గురు పూజారుల బృందాన్ని ప్రత్యేకంగా ఇక్కడికి పంపించింది.


యాంత్రిక ఎడారి జీవనంలో ఏడు కొండల వాడి స్మరణకు మించినది ఏముంటుందని బహ్రెయిన్‌లోని ప్రవాసాంధ్ర ప్రముఖుడు హరిబాబు వ్యాఖ్యానించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణత్సోవం గత కొన్ని సంవత్సరాలుగా విదేశాలలో ప్రత్యేకించి అమెరికా, ఐరోపాల్లో జరుగుతుండగా ఇప్పుడిప్పుడే గల్ఫ్ దేశాలలో మొదలయ్యింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుండగా బహ్రెయిన్‌లో మాత్రం ఇది రెండవ సారి.


