తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీ నేతలు సత్యమేవ జయతే పేరుతో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఢిల్లీ లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిరశన దీక్షలో కూర్చొన్నారు. ఢల్లీిలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఇంట్లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద లోకేశ్ దీక్షకు కూర్చొన్నారు. ఈ దీక్షలో టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలోని క్వారీ సెంటర్ వద్ద చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నిరశన దీక్షలో కూర్చొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా తొలుత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్ష చేపట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ముఖ్యనేతలు దీక్షలో కూర్చొన్నారు.
