తమ దేశంలో సిక్కు వేర్పాటువాద నాయకుడు, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ పై జరిగిన హత్యాయత్నం కుట్రలో భారత గూఢచార సంస్థ రా ప్రమేయం ఉందంటూ అగ్రాజ్యం అమెరికా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై మాస్కో తాజాగా స్పందించింది. ఈ మేరకు భారత్‌కు మద్దతిస్తూ, అమెరికా ఆరోపణలు తీవ్రంగా ఖండించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2024/05/f8900b5f-232d-4ed0-9e9a-f342ae9bc1c6-35.jpg)
ఈ కేసులో భారత పౌరుల ప్రమేయంపై వాషింగ్టన్ నమ్మదగిన సాక్ష్యాలను ఇంతవరకూ అందించలేదని పేర్కొంది. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా మాట్లాడుతూ ఇప్పటి వరకూ మాకు అందిన సమాచారం ప్రకారం, పన్నూన్‌పై హత్య కుట్ర వెనుక భారత్ ప్రమేయం గురించి వాషింగ్టన్ నమ్మదగిన సాక్ష్యాలను ఇంతవరకూ అందించలేదు. సాక్ష్యం లేనప్పుడు ఈ అంశంపై ఊహాగానాలు ఆమోదయోగ్యం కాదు అని పేర్కొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/05/50e409c6-592a-4e9f-922f-2a94141522d8-35.jpg)
ఈ సందర్భంగా అగ్రరాజ్యంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారతదేశ పార్లమెంటరీ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భారతదేశ జాతీయ మనస్తత్వం, చరిత్రపై అమెరికాకు సరైన అవగాహన లేదన్నారు. మత స్వేచ్ఛకు సంబంధించి అమెరికా నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు. భారత్‌లోని అంతర్గత రాజకీయ పరిస్థితులను అసమతుల్యత చేయడానికి, లోక్‌సభ ఎన్నికలను క్లిష్టతరం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.