సోషియో ఫాంటసీ ప్రేమకథతో రూపుదిద్దుకున్న చిత్రం దీర్ఘాయుష్మాన్ భవ. కార్తీక్‌రాజు, నోయల్, మిస్తీ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎం.పూర్ణానంద్ దర్శకుడు. త్రిపుర క్రియేషన్స్ పతాకంపై వంకాయలపాటి మురళీకృష్ణ నిర్మించారు. ట్రైలర్‌ను తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కె.ఎల్.దామోదర ప్రసాద్, పాటలను జబర్దస్త్ ఆర్.పీ ఆవిష్కరించారు.

ఈ చిత్రాన్ని నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ థియేట్రికల్ రిలీజ్ చేయనుంది. సోషియో ఫాంటసీ అంశాలు కలబోసిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇదని, ప్రేక్షకుల్ని ఆద్యంతం నవ్విస్తుందని దర్శకుడు తెలిపారు. ఈ నెల 11న విడుదల చేయబోతున్నామని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, దర్శకత్వం: ఎం.పూర్ణానంద్.
















