రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. దీనిపై భారత విదేశాంగ శాఖ ఓ క్లారిటీ ఇచ్చారు. రష్యా, ఉక్రెయిన్ వివాదంలో భారత ప్రభుత్వ వైఖరి తటస్థంగానే వుంటుందని పేర్కొంది. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా భారత్‌కు అటు అమెరికా, ఇటు రష్యా రెండూ ముఖ్యమే. అందుకే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తటస్థ వైఖరే సరైందని విదేశాంగ శాఖ పేర్కొంటోంది. యూరోపియన్ దేశాలతో కూడా ఇదే విషయంపై భారత్ నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే, వైఖరిని స్పష్టం చేస్తోంది. అంతర్జాతీయ వేదికల నుంచి కూడా భారత్ ఇదే విషయాన్ని చెబుతూ వస్తోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ పరిస్థితులు కేవలం చర్చలు, దౌత్యం ద్వారానే సరిచేసుకోవాలని పేర్కొంటోంది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో దౌత్యమే ఏకైక మార్గమని, అన్ని పక్షాలూ సమయమనంతో ఉండాలని భారత్ విజ్ఞప్తి చేసింది.
