అరబ్ దేశం సౌదీ అరేబియా కొంతకాలంగా మహిళల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంది. వారిని ఒంటరిగా బయటకు వచ్చేందుకు వీలు కల్పించింది. అలాగే ఉద్యోగాలు కూడా చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. కార్ల డ్రైవింగ్‌కు కూడా అనుమతి ఇచ్చింది. అలాగే ట్యాక్సీ డ్రైవర్లుగా సైతం చేస్తున్నారు. సౌదీ అరేబియా ప్రభుత్వం గత కొంతకాలంగా మహిళలను అన్ని రంగాలలో భాగస్వాములను చేస్తోంది. మహిళా సాధికారత `సామాజిక భద్రత అనే ఆలోచనతో ముందుకు వెళ్తోంది. ఇక తాజాగా సౌదీ అరేబియా ప్రభుత్వం వారి విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది.
అదే హై స్పీడ్ రైళ్లు నడిపేందుకు మహిళలకు అవకాశం ఇవ్వడం. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా 31 మంది మహిళలను శిక్షణ కోసం ఎంపిక చేసింది. మొదట ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు భారీ స్పందన వచ్చింది. ఏకంగా 28 వేల మంది మహిళలు దీని కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 145 మంది పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. అనంతరం ఈ 145 మంది నుంచి కేవలం 31 మంది మాత్రమే ఫస్ట్ స్టేజ్ ట్రైనింగ్‌కు సెలెక్ట్ కావడం జరిగింది. తాజాగా వీరికి మొదటి దశ శిక్షణ పూర్తి అయింది. త్వరలోనే వీరు రెండో దళ శిక్షణకు వెళ్లనున్నారు.
ఐదు నెలల ఉండే ఈ శిక్షణ ట్రైనీలు ప్రొఫెషనల్ డ్రైవర్ల సమక్షంలో ప్రాక్టికల్ శిక్షణను పూర్తి చేయనున్నారు. ఇక తుది దశ శిక్షణను పూర్తి చేసుకుని ఎంపికైన మహిళలు మక్కా, మదీనా నగరాల మధ్య ఒక ఏడాది తర్వాత బుల్లెట్ ట్రైన్స్‌ను నడుపుతారని సంబంధిత అధికారులు తెలిపారు.