దుబాయిలోని తెలుగు ప్రవాస సంఘమైన గల్ఫ్ మైనార్టీ కౌన్సిల్ (జీఎంసీ) 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రవాసులు ఘనంగా జరుపుకున్నారు. జీఎంసీ ప్రతినిధి ఫహీం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఎల్లలు దాటి విదేశాలలో అడుగుపెట్టిన అనంతరం దేశ భక్తి మరింత రెట్టింపవుతుందని అన్నారు. విదేశాలలో ఉండి కూడా భారత్ కోసం, తోటి భారతీయుల కొరకు తపించడం నిజమైన జాతీయస్ఫూర్తి అని అన్నారు. దుబాయిలో వైవిధ్య భారతీయంలో ఏకత్వం ప్రతిబింబిస్తుందని ఫహీం తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రవాసీయులను కలుపుకోని తమ సంస్ధ ముందుకు వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. హార్ ఘర్ తిరంగా ను సంవత్సరం పొడువునా పాటించవల్సిన అవశ్యకత ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో జీఎంసీ ప్రతినిధులు షేక్ అబ్దుల్లా, రిజ్వాన్, జాఫర్, అల్లాబక్ష్, సెహ్రీష్‌లతో పాటు అపెక్స్ అడిటింగ్ సంస్ధ యాజమానులు ఖాజ అబ్దుల్ ముతలిబ్, అజయ్ చతుర్వేది, ఏపీ ఎన్నార్టీ కోర్డినేటర్ అక్రం పాల్గొన్నారు.