అంతర్జాతీయ వేదిక అయిన ఐక్యరాజ్యసమితిలో దాయాది దేశం పాకిస్థాన్ తీరును భారత్ ఎండగట్టింది. చెప్పిందే చెప్పే చెత్త రికార్డు పాకిస్థాన్ సొంతమని విసుగును ప్రదర్శించింది. ఐరాస జనరల్ అసెంబ్లీలో అయోధ్య రామాలయం, సీఏఏ అమలు గురించి ఆ దేశ రాయబారి అసందర్భ వ్యాఖ్యలు చేయడంతో భారత్ తీవ్రంగా ఖండించింది. ఐరాస జనరల్ అసెంబ్లీలో పాకిస్థాన్ రాయబారి మునీర్ అక్రమ్ మాట్లాడుతూ అయో ధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ఠ, ఇటీవల అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి తప్పు డు ప్రస్తావన చేశారు. దీనిపై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ స్పందించారు. నా దేశానికి సంబంధించిన విషయాలపై పాకిస్థాన్ ప్రతినిధి బృందం సంకుచిత, తప్పుదోవ పట్టించే దృక్ఫథాన్ని కలిగి ఉండటం దురదృష్టకరమన్నారు. ఈ జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ స్థాయి కలిగిన లోతైన అంశాల గురించి పరిగణిస్తుంటే మీ దగ్గర నుంచి భిన్నమైన వైఖరి కనిపిస్తోందని కాంబోజ్ మండిపడ్డారు. ఎప్పుడూ చెప్పిందే చెప్పే చెత్త రికార్డు కలిగిన పాకిస్థాన్ ప్రతినిధి బృందం, ప్రపంచం పురోగమిస్తోన్న తరుణంలో స్తబ్ధుగా ఉండటం విచారకరమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.