ఐక్యరాజ్యసమితిలో భారత్ మరోసారి రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది. ఉక్రెయిన్‌లో నాలుగు ప్రాంతాలను రష్యా దురాక్రమించడాన్ని వ్యతిరేకిస్తూ ఐరాస సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానంపై రహస్య ఓటింగ్ నిర్వహించాలన్న రష్యా డిమాండ్ ను భారత్ తిరస్కరించింది. దీనిపై జరిగిన ఓటింగ్‌లో మరో 100కు పైగా దేశాలతో కలిసి రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది. ఉక్రెయిన్‌లోని లుహాన్‌స్క్, డొనెట్‌స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలను రష్యా విలీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ అల్బేనియా తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై రష్యా రహస్య ఓటింగ్ డిమాండ్‌ను భారత్ సహా 107 సభ్య దేశాలు తిరస్కరించాయి. 13 దేశాలు రష్యా డిమాండ్‌కు అనుకూలంగా ఓటేయగా చైనా సహా 39 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఈ ఘటనతో మిత్రదేశంగా ఉన్న రష్యాకు భారత్ షాక్ ఇచ్చినట్టుయింది. రష్యా చేసిన డిమాండ్‌ను తిరస్కరిస్తూ భారత్ ఓటు వేయడంపై ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
