వరుసగా రెండో సంవత్సరం విజిటర్ వీసాలతోసహా 10 లక్షలకు పైగా నాన్ ఇమిగ్రంట్ వీసాలను అమెరికా భారత్‌కు జారీ చేసింది. 2008/2009 విద్యా సంవత్సరం తర్వాత 2024లో అత్యధిక అంతర్జాతీయ విద్యార్థులను అమెరికాకు పంపించిన ఘనత భారత్ దక్కించుకున్నట్టు భారత్‌లోని అమెరికన్ ఎంబసీ ప్రకటించింది. వరుసగా రెండేళ్లు అత్యధిక సంఖ్యలో అంతర్జాతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థులను అమెరికాకు పంపిన దేశాలలో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని అమెరికన్ మిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
గడచిన నాలుగేళ్లుగా అమెరికాకు అత్యధికంగా భారతీయులు ప్రయాణిస్తున్నారని తెలిపింది. ఈ ఏడాది అమెరికాలో ఉంటూనే హెచ్1-బీ వీసా రెన్యువల్ చేసుకునేందుకు ఒక పైలట్ కార్యక్రమాన్ని విజయవంతంగా తమ విదేశాంగ శాఖ అమలు చేసిందని ఎంబసీ తెలిపింది. దీని వల్ల దేశాన్ని వీడకుండానే తమ వీసాలను రెన్యువల్ చేసుకునే అవకాశం భారతీయ ప్రత్యేక వృత్తి నిపుణులకు లభిస్తుందని పేర్కొన్నది.