భారత్-అమెరికా మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఒప్పందానికి సంబంధించిన పనులు 90 శాతానికి పైగా పూర్తయ్యాయని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం కొన్ని తుది అంశాలపైనే ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటివరకు తుది ఒప్పందంపై అధికారిక సంతకాలు జరగలేదు.

అమెరికా అధికారి వ్యాఖ్యల ప్రకారం భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు గత కొన్ని దశాబ్దాలుగా అత్యంత క్లిష్టమైన అంశాల్లో ఒకటిగా ఉన్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత విస్తరించేందుకు అనేక అంశాలపై చర్చలు జరిగాయి. తుది దశలో ఉన్న అంశాలను ఇరు దేశాలు పరిష్కరించగలిగితే వాణిజ్య రంగంలో ద్వైపాక్షిక సంబంధాలకు మరింత విస్తృత అవకాశాలు ఏర్పడతాయని అమెరికా అధికారి అభిప్రాయపడ్డారు. అయితే మిగిలిన అంశాల స్వభావం, వాటిపై ఏకాభిప్రాయం ఎప్పుడు కుదురుతుందనే విషయంపై స్పష్టమైన అధికారిక గడువు ప్రకటించలేదు.















