మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ (ఎంటిఎ) బోర్డుకు సేవ చేసేందుకు ఇండియన్ అమెరికన్ అటార్నీ మీరా జోషి నియామకమయ్యారు. న్యూయార్క్ సిటీ మేయర్ ఏరిక్ ఆడమ్స్ ఈ మేరకు నియామకం చేశారు. 2022 జనవరి నుంచి జోషి న్యూయార్క్ సిటీ ఆపరేషన్స్ డిప్యూటీ మేయర్‌గా ఉంటున్నారు. ఆడమ్స్ నిర్వహ ణలోని రవాణా సౌకర్యాలు, వాతావరణ శాఖలను ఆమె చూస్తున్నారు. ఈ నియామకానికి సంబంధించి గత వారం విడుదలైన ప్రకటనలో ఎంటిఎ భవిష్య పురోగతిని సాధించగల సరైన వ్యక్తి జోషి అని, రవాణాలో ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలు , భద్రత, అనుసంధానం సాధించగలరని ఆడమ్ అభిలషించారు.
న్యూయార్క్ ప్రజలందరికీ రవాణా సౌకర్యాలు అందుబాటు లోకి తీసుకురాడానికి విశేష కృషి చేయగలరన్న విశ్వాసం తమకు ఉందని ఆడమ్ ప్రకటనలో పేర్కొన్నారు. న్యూయార్క్ సిటీ రవాణా వ్యవస్థ తమ వెన్నుముక వంటిదని, ఈ వెన్నుముక బలంగా ఉండేలా జోషి ప్రయత్నించగలరని పేర్కొన్నారు. న్యూయార్క్ స్ట్రీట్ సేఫ్టీవర్క్ నిర్వహణలో జోషి కీలక పాత్ర వహించారు. 2023లో ఈ వ్యవస్థ న్యూయార్క్ సిటీని ప్రపంచం లోనే పాదచారులకు రెండో భద్రతా నగరంగా గుర్తింపు పొందడానికి సహకరించింది. జోషి బృందాలు న్యూయార్క్ నగరం లోని భవనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను అదుపు చేసి హరిత ప్రాంతంగా తీర్చి దిద్దడానికి నిరంతరం శ్రమిస్తున్నాయి.