అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర సెనేట్‌లో ప్రవేశపెట్టిన కులవివక్ష వ్యతిరేక బిల్లుకు వ్యతిరేకంగా భారతీయ అమెరికన్లు కాలిఫోర్నియాలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఉత్తర అమెరికా హిందువుల సంఘం నిర్వహించిన ర్యాలీలో నిరసనకారులు మాట్లాడుతూ ఈ బిల్లు జాతి, మత, వంశ తారతమ్యాలు లేకుండా అందరికీ సమానత్వం, న్యాయం అందించాలన్న ప్రాథమిక సూత్రాలకు భంగం కలుగుతుందన్నారు. హిందువులు, ఆసియా వాసుల్లో అపరాధ భావం పెరుగుతుంది. వారిపై ఇతరులకు ఒక నిశ్చితాభిప్రాయం ఏర్పడుతుంది. దీని వల్ల మా పిల్లలకు హాని కలుగుతుంది అని హర్ష్ సింగ్ అనే టెక్ ఉద్యోగి అభిప్రాయపడ్డారు. ఈ బిల్లు ద్వారా అనుభవజ్ఞులని చెప్పుకునే మేధావులంతా హిందువుల వివరాలను బహిరంగ పరుస్తారని దీపక్ అనే వ్యక్తి అన్నారు. హిందువుల చివరి పేర్లను బట్టి, వారి ఆహారపు అలవాట్లను బట్టి లేదా వారి చర్మం రంగును బట్టి తామెవరో తెలిసేలా చేసేందుకే ఈ చట్టం తెచ్చినట్టు ఉన్నారని చెప్పారు. కులాన్ని క్రోడీకరించడం అమెరికాలో హిందూఫోబియాకు ఆజ్యం పోసినట్టవుతుందని చాలా మంది భారతీయ అమెరికన్లు భావిస్తున్నారు.