భారతీయ సంతతికి చెందిన 17 ఏళ్ల అమ్మాయి రిద్ది చౌహాన్ అమెరికాలో దూసుకెళ్తున్నది. న్యూయార్క్‌లోని తన స్కూల్‌లో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నది. నేవీ జూనియర్ రిజర్వ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్ప్స్‌కు ఆమె లీడర్ అయ్యింది. ప్రస్తుతం అమెరికా యువతకు ఆమె ఆదర్శంగా నిలుస్తున్నారు. న్యూయార్క్‌లోని బెంజిమన్ కార్డోజో హై స్కూల్‌కు నేవీ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ అయ్యారు. ఎన్‌జేఆర్ఓటీసీ ప్రోగ్రామ్‌లో హయ్యస్ట్ ర్యాంక్ స్టూడెంట్‌గా నిలిచిందామె. ఆ గ్రూపులో ఉన్న సుమారు 300 మంది క్యాడెట్లకు ఆమె నాయకత్వం వహిస్తున్నది.

బెటాలియన్ ఆపరేషన్స్, ట్రైనింగ్, స్టూడెంట్ వెల్ఫేర్ చూసుకుంటా, అకాడమిక్ చదువులోనూ నిమగ్నమవుతోంది. ప్రతి రోజు స్కూల్‌లో విద్యార్థుల చేత ఆ అమ్మాయి డ్రిల్ ప్రాక్టీస్ చేయిస్తుంది. ఎన్జేఆర్ఓటీసీ ప్రోగ్రామ్‌కు అమెరికా నౌకాదళం మద్దతు ఇస్తోంది. అమెరికా హై స్కూళ్లలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. విద్యార్థుల్లో నాయకత్వం, క్రమశిక్షణ, క్యారెక్టర్, టీమ్ వర్క్ డెవలప్ చేయడం కోసం ఆ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేశారు. అయితే తన నాయకత్వ లక్షణాలను మెరుగుపరుచుకునే ఉద్దేశంతో ఆ ప్రోగ్రామ్‌లో చేరినట్లు చౌహాన్ చెప్పింది. పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటున్న ఆమె.. తన కెరీర్‌ను నావల్ ఆఫీసర్‌గా ఎంచుకునే అవకాశం ఉన్నది.

రిద్ది చౌహాన్ పేరెంట్స్ రాజస్థాన్‌కు చెందినవారు. ఆమె పేరెంట్స్ రుచిక, దిలీప్ చౌహాన్, ప్రస్తుతం న్యూయార్క్‌లో సెటిల్ అయ్యారు. ఆమెకు ఓ సోదరి ఉన్నది. కహిని గుప్తా చౌహాన్ మెడికల్ ప్రొఫెషన్‌లో పనిచేస్తోంది. బెటాలియన్ ఆఫీసర్‌గా మారడానికి ముందు ఆమె కొన్ని హోదాల్లో చేసింది. అకాడమిక్ కమాండర్, స్టెమ్ కమాండర్, ప్లాటూన్ లీడర్, ఇన్‌స్పెక్షన్ కమాండర్ రోల్స్‌లోనూ చౌహాన్ రాణించింది. సుమారు 200 మంది క్యాడెట్లకు ఆ యువతి సహకారాన్ని అందించింది. నావల్ అకాడమీ స్కూల్‌కు వెళ్లేందుకు రిద్ధి చౌహాన్ ప్రయత్నిస్తోంది. అక్కడ నుంచి ఆమె అమెరికా నావల్ అకాడమీకి వెళ్లి, ఆ తర్వాత యూఎస్ నావల్ ఆఫీసర్ కావాలని భావిస్తున్నది.





























