శాశ్వత నివాసానికి(పీఆర్) సంబంధించి కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్(పీఈఐ) ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా భారతీయ విద్యార్థులు నిరసనలను తీవ్రతరం చేస్తున్నారు. 2024లో 2,100 మందికి బదులుగా 1,600 మందికే పీఆర్ ఇవ్వాలని స్థానిక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రొవిన్షియల్ నామినీ ప్రోగ్రామ్(పీఎన్‌పీ) కింద పీఆర్‌కు నామినేట్ అయిన వారిని కూడా తగ్గించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాలు కెనడాలో చదువు పూర్తి చేసుకొని పీఆర్‌పై ఆశలు పెట్టుకున్న భారతీయ విద్యార్థులకు ఇబ్బంది కరంగా మారాయి. వీరిలో చాలామంది వీసా గడువు కూడా ముగుస్తున్నది. వీరు కెనడా వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే దాదాపు 50 మంది భారత్‌కు తిరిగొచ్చేశారు.