భారతీయ సమాజంలో వివాహానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పేదలైనా, ధనికులైనా, మధ్య తరగతి వారైనా ఉన్నంతలో తమ కుమారుడు లేదా కుమార్తె పెండ్లిని ఘనంగా జరపాలని కోరుకుంటారు. అప్పు చేసైనా, ఆస్తులు అమ్మైనా పెండ్లి ఖర్చు విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గరు. భారతీయులు వివాహాని కి ఎంతగా ప్రాధాన్యత ఇస్తున్నారో ఒ సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. మన దేశంలో పిల్లల చదువుపై పెడుతున్న ఖర్చు కంటే వివాహాలపై రెండింతలు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని తేలింది. అందుకే, భారతీయు లు ఏటా వివాహాలకు ఖర్చు చేసే మొత్తం అమెరికాలో చేసే ఖర్చు కంటే రెట్టింపు ఉందని ఈ నివేదిక పేర్కొన్నది.
భారతీయులు వివాహాల కోసం ఏటా రూ.10.7 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని నివేదిక తెలిపింది. దేశంలో సగటున ఒక వివాహానికి రూ.12.5 లక్షలు ఖర్చు చేస్తున్నారని, ఇది దంపతుల ప్రీ-ప్రైమరీ నుంచి డిగ్రీ వరకు చదువుపై చేసే ఖర్చు కంటే రెండింతలు అని పేర్కొన్నది. భారతీయులు సగటున వివాహానికి వెచ్చిస్తున్న మొత్తం మన దేశ తలసరి జీడీపీ(రూ.2.4 లక్షలు) కంటే ఐదు రెట్లు ఎక్కువ. దేశంలో సగటు కుటుంబ వార్షికా దాయం (రూ.4 లక్షలు) కంటే మూడు రెట్లు ఎక్కువ.
భారత్‌లో వివాహాల సీజన్‌పై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తుంటారు. అనేక చిన్న వ్యాపారాలు, సేవలు అందించే వారు వెడ్డింగ్ సీజన్ కోసం ఎదురుచూస్తుంటారు. మన దేశంలో అమ్ముడవుతున్న మొత్తం ఆభరణా ల్లో వివాహ ఆభరణాల వాటానే 50 శాతం ఉంటుందని, మొత్తం వస్ర్తాల అమ్మకాల్లో వివాహ వస్ర్తాల వాటా 10 శాతం ఉంటుందని ఈ నివేదిక లెక్కగట్టింది.