తోటి భారతీయులకు వీలైనంత సహాయం చేసే స్వభావాన్ని ప్రవాసులు మరింత పెంపొందించుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు ఉద్బోధించారు. దుబాయిలోని ఇండియన్ పీపుల్స్ ఫోరం తెలంగాణ విభాగం కన్వీనర్ కుంభాల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలోని ఫోరం ప్రతినిధుల బృందంతో ఆయన మాట్లాడారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారు అని కాకుండా తమ పరిధిలో ఎంత వీలైతే అంత సాయం చేయాలని ఆయన నొక్కి చెప్పారు.
ఈ సందర్భంగా విదేశీ గడ్డపై ఉన్న ప్రతి ఒక్క భారతీయుడినీ దేశ రాయబారిగా ఆయన అభివర్ణించారు. ఆచార వ్యవహారాల పట్ల చిత్తశుద్ధితో ఉండే గల్ఫ్ అరబ్బుల వ్యవహారాలను గమనించి, గౌరవిస్తూ, భారతీయ సంస్కృతిని తెలియజేయడానికి ప్రవాసీయులందరు ప్రయత్నించాలని సూచించారు. పరాయి గడ్డపై భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ప్రవాస భారతీయులు కృషి చేయాలని కోరారు. గల్ఫ్ దేశాలలో ప్రతి రంగంలోనూ తట్ట మోసే భవన నిర్మాణ కార్మికుడి నుంచి మొదలు ఐటీ నిపుణులు, వైద్యులు, వజ్రాల వ్యాపారుల వరకు ప్రతి చోటా భారతీయులు రాణించడం అందునా చెప్పుకోదగ్గ సంఖ్యలో తెలుగు వారుండటం గర్వంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు.