
2020 లో పలువురు విదేశీయులు ఎటువంటి పత్రాలు లేకుండా అమెరికాలోకి చొరబడ్డారు. అదే మార్గంలో గుజరాత్‌లోని మెహసానా జిల్లా కడీ ప్రాంతానికి చెందిన లాయర్ దంపతులు తమ రెండేండ్ల కుమారుడిని ఇండియాలోనే వదిలేసి అమెరికాలో కాలుపెట్టారు. ఆ తరువాత రెండేండ్లకు వారి బంధువు ఒకరు (అక్రమ మార్గంలో) అమెరికా వస్తుండగా తమ కుమారుడిని కూడా వెంటపెట్టుకొని రమ్మని చెప్పారు. అప్పటికి ఐదేండ్ల వయసున్న బాలుడిని ఆ బంధువు టెక్సాస్ సరిహద్దులో వదిలేసి మాయమైపోయాడు. అమెరికా భద్రతా అధికారికి దొరికిన ఆ బాలుడి జేబులో ఓ చీటీ లభించింది. ఆ చీటీలో బాలుడి తల్లిదండ్రుల పేర్లు, ఫోన్ నంబర్లు ఉన్నాయి. వాటి ఆధారంగా తల్లిదండ్రులను సంప్రదించిన అధికారులు ఆ బాలుడిని వారికి అప్పగించారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఇలా వ్యూహాత్మకంగా వదలిపెట్టడం అనే పద్ధతిని అనుసరిస్తున్నారని ఓ అధికారి తెలిపారు. ప్రతి ఏటా పదుల సంఖ్యలో ఇలా మెక్సికో లేదా కెనడా సరిహద్దుల్లో భారతీయుల పిల్లలు అధికారులకు దొరుకుతుంటారని చెప్పారు. అమెరికా కస్టమ్స్, బార్డర్ ప్రొటెక్షన్ నివేదిక ప్రకారం 2022 నుంచి 2025 వరకు 1,656 మంది భారతీయ మైనర్లు అమెరికాలోకి ఇదే పద్ధతిలో ప్రవేశించినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి.
