ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్స్ దుమ్మురేపుతున్నారు. చైనాలోని హంగ్జూ వేదికగా జరుగుతోన్న ఏషియా క్రీడల్లో భారత ప్లేయర్స్ పతకాల పంటను పండిస్తున్నారు. ఈసారి భారత ప్లేయర్స్ ఏకంగా 100 పతకాలు సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 25 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్యాలతో పతకాల పట్టికలో టీమ్‌ఇండియా ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్నది.
మహిళల కబడ్డీ ఫైనల్‌లో భారత్ 26-25తో చైనీస్ తైపీని మట్టికరిపించింది. దీంతో టీమ్‌ఇండియా స్వర్ణం చేజిక్కించుకుంది. అంతకుముందు ఆర్చరీలో ఇండియాకు నాలుగు పతకాలు లభించాయి. ఆర్చరీ మహిళల కాంపౌండ్ సింగిల్స్‌లో జ్యోతి సురేఖ స్వర్ణం సాధించగా, అదితి గోపీచంద్ కాంస్యం గెలుపొందింది. ఇక ఆర్చరీ పురుషుల కాంపౌండ్ సింగిల్స్‌లో ఓజాస్ ప్రవీణ్ డియోటలేకు స్వర్ణం లభించగా, అభిషేక్ వర్మ సిల్వర్ సొంతం చేసుకున్నాడు. ఆసియా క్రీడల్లో ఓజాస్‌కు ఇది మూడో బంగారు పతకం కావడం విశేషం.

భారత ఆటగాళ్లు ఈ అద్భుతాన్ని సాకారం చేసినందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆసియా క్రీడల్లో భారత్ అద్భుత విజయం సాధించిందని తెలిపారు. ఇక అక్టోబర్ 10వ తేదీన ఆసియా క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులను ప్రధాని కలవనున్నారు. దేశ ఖ్యాతిని పెంచిన క్రీడాకారులతో మాట్లాడడానికి తాను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని తెలిపారు.