అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్, స్నోహోమిష్ కౌంటీలో దొంగతనాలు పెరుగుతున్నాయి. దొంగలు ముఖ్యంగా భారతీయ అమెరికన్ల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ దొంగలను పట్టుకోవడానికి సహకరించాలని పోలీసులు ప్రజలను కోరారు. పట్టపగలే వీరు దొంగతనాలకు పాల్పడుతుండటాన్ని బట్టి వీరంతా ఓ పెద్ద వ్యవస్థీకృత ముఠాకు చెందినవారై ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ అనుమానితుల ఫొటోలు, వీడియోలు ఉంటే తమకు పంపించాలని ప్రజలను కోరారు. ఈ కౌంటీలోకి కొత్తగా వచ్చిన దంపతులు మాట్లాడుతూ ఇక్కడ భద్రత ఉంటుందని భావించామని, ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పారు. నిఘా కెమెరాల కోసం వేలాది డాలర్లు ఖర్చుపెట్టామని చెప్పారు. ఇండియన్ అమెరికన్లలో చాలా మంది అమెరికన్ పౌరులు కానందు వల్ల తుపాకీని తమ వద్ద ఉంచుకునే అవకాశం లేదన్నారు. ఇదే దొంగలకు సానుకూలంగా కనిపించి ఉండవచ్చునని తెలిపారు.