ఆర్థికంగా బలపడేందుకు ఇండోనేషియా కీలక నిర్ణయం తీసుకుంది. సంపన్న విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు సరికొత్త ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. బాలీ పర్యాటక ప్రాంతం ద్వారా విదేశీ సంపన్న పర్యాటకులను ఆకర్షించేందుకు సెకండ్ హోమ్ వీసా ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా 5, 10ఏళ్ల గడువుతో కూడిన టూరిస్ట్ వీసాలను జారీ చేయనున్నట్టు ఇండోనేషియా తాజాగా ప్రకటించింది. ఈ వీసాలు పొందిన టూరిస్ట్‌లు గరిష్టంగా 10ఏళ్ల పాటు తమ దేశంలో ఉండొచ్చని వివరించింది. పెట్టుబడితోపాటు ఇతర కార్యకలాపాలు కూడా సాగించొచ్చని వెల్లడించింది. అయితే ఈ వీసాలు పొందాలనుకునే టూరిస్ట్‌లు తమ బ్యాంకు అకౌంట్లో 1,30,000 డాలర్లను కలిగి ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ప్రోగ్రామ్ క్రిస్మస్ రోజు నుంచి అమలులోకి వస్తుందని ఇండోనేషియా వెల్లడించింది.