అగ్ర రాజ్యం అమెరికాలో శాశ్వత నివాస హోదాకు వీలు కల్పించే గ్రీన్ కార్డ్ ను పొందటం చాలా కష్టంగా మారుతున్నది. భారతీయ వృత్తి నిపుణుల గ్రీన్‌కార్డ్ బ్యాక్‌లాగ్స్ సంఖ్య రికార్డు స్థాయిలో 18 లక్షలు దాటింది. ఇందులో 10.7 లక్షల దరఖాస్తుల ప్రాసెసింగ్‌కు దాదాపు 134 ఏండ్లు పడుతుందని తాజా అధ్యయనం ఒకటి పేర్కొన్నది. అమెరికా ప్రభుత్వం ఏటా 1,40,000 గ్రీన్‌కార్డులు మంజూరు చేస్తుంది. ఇందులో ఒక్కో దేశం కోటా 7 శాతం. కాటో ఇనిస్టిట్యూట్ అసోసియేట్ డైరెక్టరేట్ డేవిడ్ జే బైయర్ మాట్లాడుతూ గ్రీన్‌కార్డ్ దరఖాస్తుల ప్రాసెసింగ్‌కు పడుతున్న సమయాన్ని లెక్కలోకి తీసుకుంటే, కొత్త దరఖాస్తుదారులు చనిపోయేలోగా గ్రీన్ కార్డ్ వచ్చే పరిస్థితి కనపడటం లేదని చెప్పారు. జీవితకాలం ఎదురుచూడాల్సిన వారి సంఖ్య సుమారుగా 4,24,000గా ఉంది అని తెలిపారు.