మల్టీరోల్ స్టీల్త్ గైడెడ్ మిస్సైల్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ తుషిల్ ఇవాళ జలప్రవేశం చేసింది. రష్యాలోని కాలినిన్ గ్రాడ్‌లో ఆ నౌకను ఆవిష్కించారు. ఈ కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఐఎన్ఎస్ తుషిల్ జలప్రవేశంతో సముద్ర గస్తీలో భారత సామర్థ్యం పెరుగుతున్నట్లు రాజ్‌నాథ్ తెలిపారు. ఏఐ, కౌంటర్ టెర్రరిజం లాంటి అంశాల్లో భారత్, రష్యా సహకారం కొత్త దశకు చేరుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి, అడ్మిరల్ అలెగ్జాండర్ మోసేవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఐఎన్ఎస్ తుషిల్‌ను రక్షణ కవచంతో పోల్చుతున్నారు. క్రివాక్ 3 క్లాస్ ఫ్రిగేట్‌కు చెందిన అప్‌గ్రేడ్ వర్షన్ ఇది. ఇప్పటికే ఇలాంటి ఆరు యుద్దనౌకలు ఇండియన్ నేవీలో ఉన్నాయి. వాటిల్లో మూడు తల్వార్ క్లాస్ ఉన్నాయి. 1135.6 ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఏడవ యుద్ధ నౌక ఐఎన్ఎస్ తుషిల్. భారతీయ నౌకాదళ స్పెషలిస్టుల సమక్షంలోనే తుషిల్ నిర్మాణం జరిగినట్లు చెబుతున్నారు. నిర్మాణం తర్వాత అనేక సార్లు ఆ యుద్ధనౌకతో ట్రయల్స్ నిర్వహించారు. ఈ ఏడాది జనవరి నుంచే ట్రయల్స్ చేశారు. ఇండియన్ నేవీలోని స్వార్డ్ ఆర్మ్‌తో తుషిల్ కలవనున్నది. వెస్ట్రన్ నావెల్ కమాండ్ కింద ఈ యుద్ధనౌక పనిచేస్తుంది.