ఇరాన్ అన్నంత పనీ చేసింది. సిరియాలోని తమ కాన్సులేట్ భవనం ఘటన తర్వాత ప్రతీకారంతో రగిలిపో తున్న ఇరాన్ చెప్పినట్లే ఇజ్రాయెల్‌పై దాడికి దిగింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో 200కుపైగా కిల్లర్ డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైళ్లు, క్రూయిజ్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాక్ గగనతలం నుంచి ఇజ్రాయెల్ వైపుగా అవి దూసుకెళ్లాయి. అయితే కొన్నింటిని మధ్యప్రాచ్యంలోని అమెరికా దళాలు మధ్యలోనే కూల్చివేయ గా మరికొన్నింటిని సిరియా, జోర్డాన్ గగనతలం మీదుగా ఇజ్రాయెల్ నేలమట్టం చేసినట్లు తెలుస్తున్నది.
ఇక ఇజ్రాయెల్ ఎయిరోస్పేస్‌పై మరికొన్నింటిని ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. దీంతో జెరూస లెంలో ఉన్న అలారంలు మార్మోగాయి. గగణ తలం నుంచి గగణ తలంలోకి మిస్సైళ్లను తమ భూభాగం పైకి ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. అయితే వాటిని నిలువరించామని పేర్కొంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనాన్, ఇరాక్ తమ గగనతలాలను మూసివేశాయి. సిరియా, జోర్డాన్ దేశాలు తమ వైమానిక దళాలను అప్రమత్తం చేశాయి.