రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంకా బతికే ఉన్నారో లేదో అన్నది ఖచ్చితంగా తనకు తెలియదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అనుమానం వ్యక్తం చేశారు. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సందర్భంగా జరిగిన ప్రైవేట్ ఈవెంట్లో ఆయన పాల్గొన్నారు. రష్యాతో శాంతియుత చర్చలు ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు. నేను ఎవరితో, దేని గురించి మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు. రష్యా అధ్యక్షుడు అందుకు సరైన వ్యక్తా అన్నది నాకు ఖచ్చితంగా తెలియదు. ఆయన బతికే ఉన్నారా? నిర్ణయాలు ఆయనే తీసుకుంటున్నారా? లేక ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారు? మేం ఎవరితో శాంతి చర్చలు జరుపాలి? అన్నది నాకు అర్థం కావడం లేదు అని అన్నారు. పుతిన్ చాలా కాలంగా బహిరంగంగా కనిపించకపోవడం, డిసెంబర్లో జరుగాల్సిన వార్షిక ప్రెస్ మీట్ను రద్దు చేయడంతో ఆయన సజీవంగా ఉన్నారా లేదా అన్న దానిపై జెలెన్స్కీ అనుమానం వ్యక్తం చేశారు.