గాజా లో 60 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రకటన వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్‌ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని వ్యాఖ్యానించారు. హమాస్ ఉండదు, హమస్థాన్ ఉండదు. ఆ సంస్థను పూర్తిగా తుడిచిపెట్టేస్తాం అని వ్యాఖ్యానించారు.

గాజా అంశంలో తమ ప్రతినిధులు ఇజ్రాయెల్‌తో సుదీర్ఘ చర్చలు చేపట్టారని అధ్యక్షుడు ట్రంప్ తెలిపిన విషయం తెలిసిందే. గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని, ఆ సమయంలో అన్ని పార్టీలతో కలిసి యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తామన్నారు. శాంతి ఒప్పందం కోసం ఖతార్, ఈజిప్ట్ తీవ్రంగా ప్రయత్నించాయని, వాళ్లే దీనికి సంబంధించిన తుది ప్రతిపాదన చేస్తారన్నారు. మిడిల్ఈస్ట్ మంచి కోసం హమాస్ ఆ ఒప్పందాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే, గాజాపై యుద్ధాన్ని పూర్తిగా ఆపేస్తామంటేనే ఒప్పందాన్ని అంగీకరిస్తామని హమాస్ సంస్థ తెలిపింది.















