అణ్వాయుధాలు కలిగి ఉన్న పాకిస్థాన్ విదేశాలను అప్పు అడగడం సిగ్గు చేటని ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (పీఏఎస్) ప్రొబేషనరీ ఆఫీసర్స్ వేడుకకి ముఖ్య అతిథిగా షరీఫ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టేందుకు అప్పులు చేయడం సరైన పరిష్కారం కాదని, తీసుకున్న రుణాలను తిరిగి తీర్చక తప్పదని తెలిపారు. న్యూక్లియర్ పవర్ ఉన్న పాకిస్థాన్ డబ్బుల కోసం విదేశాల దగ్గర చేయి చాచడం సిగ్గుగా ఉందని అన్నారు. ఈ మధ్య తాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయాద్ వంద కోట్ల డాలర్లు అప్పుగా ప్రకటించారని షరీఫ్ చెప్పారు. అంతేకాదు ఆర్థిక సాయం చేసినందుకు సౌదీ అరేబియాకు కృతజ్ఞతలు తెలిపారు.
