బ్రిటన్ ప్రభుత్వం వీసా, వలస చట్టాల్లో మార్పులు తీసుకురావాలని భావిస్తోంది. యూకేలో వలస కార్మికుల సంఖ్యను తగ్గించుకునే దిశగా ఈ మార్పులు చేయాలని యోచిస్తోంది. అదేగనుక జరిగితే యూకేలో పనిచేయాలని, అక్కడ శాశ్వత నివాస హోదా పొందాలని కలలు కనే వలసదారులు, ముఖ్యంగా భారతీయులపై ప్రభావం పడనుంది. వీసా రూల్స్ మార్పులకు సంబంధించి కీర్ స్టార్మర్ ప్రభుత్వం బ్రిటన్ పార్లమెంట్‌లో ఒక శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టనుంది. కాగా 2024లో యూకే ప్రభుత్వం విదేశీయులకు 2,10,098 వర్క్ వీసాలను ఇచ్చింది. 2023తో పోల్చుకుంటే వీసాల జారీలో 37 శాతం తగ్గుదల ఉంది. వర్క్ వీసాలను పొందిన వారిలో భారతీయులే ముందు వరుసలో ఉన్నారు.

2024లో జూన్‌తో ముగిసే 12 నెలల కాలానికి భారతీయులు 1,16,000 వీసాలు పొంది పని నిమిత్తం యూకే వెళ్లారు. 2023లో ఈ సంఖ్య 1,27,000గా ఉంది. భారతీయులకు ఎక్కువగా వైద్యం, ఐటీ, ఇంజినీరింగ్, విద్య, ఆతిథ్యం, కేటరింగ్, ట్రేడ్ సెక్టార్‌లలో పనిచేసేందుకు వీసాలు లభిస్తున్నాయి. ప్రజల నుంచి వినిపిస్తోన్న ఆందోళన, వలసలకు వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తోన్న రిఫార్మ్ యూకే కు పెరుగుతున్న ప్రజాదరణ లాంటి అంశాలు వీసా, వలస చట్టాల్లో మార్పులపై స్టార్మర్ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించేందుకు కారణమవుతున్నాయి.
